Wednesday, April 23, 2008

డైసీలూ, ఇంపలూ

ఈ టైటిలేంటో మీకేమైనా బోధపడిందా? బుర్ర గోక్కోకండిగానీ నేనే చెప్తా. ఆ మొదటి ముక్క డైలీ సీరియళ్ళకూ, రెండో ముక్క ఇంజినీరింగ్ పరీక్షలకూ సంక్షిప్త రూపాలు. ఆ రెంటికీ ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా? ఉంది... దాన్లోకే వస్తున్నా. అందరూ డైలీ సీరియళ్ళను తెగ ఆడిపోసుకుంటారు గానీ, అవి సమాజానికి చేస్తున్న సేవను ఎవరూ గుర్తించరు. ఒక్క సీరియల్లో బుక్కైతే చాలు, లైఫ్ సెటిలైనట్టే. గవర్నమెంట్ ఉద్యోగం కూడా బలాదూర్. ఇక అవి అందించే విజ్ఞాన వినోదాల గురించి రాయడానికి ఈ బ్లాగు సరిపోదు. ఇంతటి మహోన్నతమైన డైలీ సీరియళ్ళనుంచి inspire అయ్యి one day batting అవసరం లేకుండా one hour battingతో నా ఇంజినీరింగ్ పరీక్షలన్నీ దంచేశాను. ఆ కిటుకులేంటో మీకు తెలియజెప్పడానికే ఈ బ్లాగు.



ఇక్కట్నుంచీ డైసీ అన్నచోట డైలీ సీరియల్ అనీ, ఇంప అన్నచోట ఇంజినీరింగ్ పరీక్ష అనీ చదువుకోగలరు.

1. డైసీకు ఎన్ని ఎక్కువ ఎపిసోడ్లుంటే అంత పాపులర్. అలాగే ఇంపలో ఎన్ని ఎక్కువ పేజీలు రాస్తే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి. ఇది fundamental principle.

2. డైసీ చూసేప్పుడు బుర్ర అస్సలు వాడకూడదు. ఇంప రాసేప్పుడు కూడా అంతే. దేనిగురించైనా ఆలోచించడానికి పెన్ను ఆపారో మీ answer sheet లో ఓ పేజీ తగ్గుతుంది. అంటే ఓ మార్కు తగ్గినట్టే.

3. డైసీలో characters అన్నీ డైలాగ్స్ నిదానంగా, విడివిడిగా చెప్తుంటాయి. శోభన్‌బాబు లాగా గ్యాప్ లేకుండా మాట్లాడే character ఒక్కటి కూడా ఉండదు. ఇంపలోనూ అక్షరాలన్నీ ఆమడదూరంలో ఉండేట్టు, వీలైనన్ని ఎక్కువ పేజీలు occupy చేసేట్టు చూసుకోవాలి.

4. మురిక్కాల్వను చూడగానే పందులు డైవ్ చేసినట్టు question చూడగానే answer లోకి దూక్కూడదు. డైసీ బిగినింగ్‌లో చూడండి. అసలా డైసీ ఏంటి, దాని పుట్టుపూర్వోత్తరాలేంటి అని నిర్మాత, డైరెట్రూ వగైరావాళ్ళతో ఓ నాలుగైదు ఎపిసోడ్లు డీటైల్డుగా చెప్పిస్తారు. అలా ఇంపలో గూడా first అసలా question ఏంటి దాని కథాకమామీషేంటని questionనే విడమర్చి కనీసం రెండు పేజీలు రాయాలి.

5. డైసీలో detailకు పెద్దపీట వేస్తారు. చెప్పులెలా వేసుకోవాలి, అంట్లెలా తోమాలి, డైనింగ్ టేబుల్ మీద ఎలా తినాలి లాంటివన్నీ చాలా detailedగా చూపిస్తారు. చిన్న చిన్న విషయాలేకదా అని కొట్టిపడెయ్యరు. మనంకూడా దిద్దేవాడు దద్దమ్మ అనుకుని ప్రతీదీ వర్ణించి కళ్ళు తెరిపించాలి.

6. డైసీలో చూడండి ప్రతి ఎపిసోడ్‌లోనూ ముందు లాస్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది ఓ ఐదు నిమిషాలు చూపిస్తారు. అలాగే చివర్న నెక్ష్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందనేది ఇంకో ఐదు నిమిషాలు చూపిస్తారు. అలాగే ఇంపలో కూడా వర్తమానం రాస్తే సరిపోదు. భూత భవిష్యత్‌లు కూడా చూపించాలి.

7. ప్రతి ఎపిసో్డ్‌కూ బిగినింగ్‌లో టైటిలు సాంగూ, పేర్లూ, మళ్ళీ చివర్లో అదే టైటిలు సాంగూ, మిగిలిన పేర్లూ వేస్తుంటారు గదా. అలాగే ఇంపలో కూడా ప్రతి additional sheet లోనూ మీరు ఏ questionకు answer చేస్తున్నారో స్పష్టంగా తెలియజెప్పాలి. అలాగే sheet చివర్లో ఈ question ఇంకా అయిపోలేదూ, ఇంకా బోల్డు రాయాల్సుందీ అని చెప్పాలి.

8. డైసీకో ప్రత్యేకత ఉంది. వందో ఎపిసోడ్‌నుంచి వెయ్యో ఎపిసోడ్‌కు జంప్ అయినా మీరు మిస్సయ్యేదేమీ ఉండదు. కథను ఈజీగా ఫాలో అయిపోగలరు. అదే ఇంగ్లీషు సినిమాలు తీసుకోండి. పది నిమిషాలు మిస్సయితే చాలు అంతా గజిబిజిగా ఉంటుంది. అందుకే అవి ఇండియాలో ఆడలేవు. ఇంపలో కూడా దిద్దేవాడు పదో పేజీనుంచి డైరెక్టుగా ముప్పయ్యో పేజీకి వెళ్ళాలనుకున్నా ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే.

9. డైసీలో గమనించారో లేదో ఏదైనా flashback సంఘటన గురించి చెప్పాల్సొస్తే ప్రేక్షకులు ఎక్కడ మర్చిపోయుంటారో పాపం అని మళ్ళీ ఆ పాత ఎపిసోడ్ మొత్తం చూపిస్తారు. ఇంపలో కూడా ఫలానా చోట ఆల్రెడీ describe చేసాను అనికాకుండా మళ్ళీ ఇక్కడ కూడా రాయాలి.

10. డైసీలో షాకింగ్ న్యూస్ విన్నప్పుడు ఆ సీన్‌లో ఉన్న characters అన్నీ ఓ ఐదు నిమిషాల పాటు freeze అయిపోతాయి. తర్వాత కెమరా ఒక్కొక్క character face మీదుగా వెళ్తూ ఆత్మభ్రమణం పూర్తిచేసేసరికి ఆ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇంపలో equationగానీ, formulaగానీ రాసినప్పుడు దాన్ని rectangleలో highlight చేసి రకరకాల anglesలో describe చెయ్యాలి.



ఇక్కట్నుంచీ డైలీ సీరియల్ అన్నచోట డైసీ అనీ, ఇంజినీరింగ్ పరీక్ష అన్నచోట ఇంప అనీ చదువుకోగలరు.

ఇంకా రాయాలనుందిగానీ జనాలు ఆపండ్రోయ్ అని అరుస్తున్నారు. సో ఇక్కడితో పవమానం పాడక తప్పట్లేదు.

అన్నట్టు మీరు గమనించారో లేదో గానీ పైన చెప్పిన విశేషణాలన్నీ ఈ బ్లాగుకు అతికినట్టు సరిపోతాయి.

No comments: